డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటును ఖండిస్తూ జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం

  • చెత్త డంపింగ్ కేంద్రం పెడితే మాకు చావే దిక్కు
  • జాయింట్ కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందచేసిన సంపత్ నగర్, కేవీపీ కాలనీ, పార్వతీపురం వాసులు
  • మద్దతు తెలిపిన జనసేన పార్టీ నేతలు

గుంటూరు: ఒకవైపు స్మశానంలో శవాలు కాలుస్తుంటే వచ్చే వాసన మరోవైపు పీకలవాగులో పేరుకుపోయిన చెత్తాచెదారంతో వచ్చే దుర్గంధంతో నరకయాతన పడుతుంటే ఇప్పుడు చెత్త డంపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తాము బ్రతికేది ఎట్లా అంటూ సంపత్ నగర్, కేవీపీ కాలనీ పార్వతీపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, కొలసాని బాలకృష్ణ ఆధ్వర్యంలో వారు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందచేశారు. అధికారులు ఇప్పటికి పలుమార్లు వచ్చి ఇక్కడ చెత్త కేంద్రాన్ని పెట్టేదే అంటూ బెదిరిస్తున్నారని, అదే కనుక జరిగితే మాకు చావే దిక్కని మహిళలు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అదికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ.. తమ ఇళ్ల మధ్యలో చెత్త డంపింగ్ కేంద్రాన్ని పెట్టొద్దని స్థానిక మహిళలు అధికారుల కాళ్ళ వెళ్ళా పడ్డా పట్టించుకోకుండా డంపింగ్ యార్డు పనులు ప్రారంభిస్తాం అంటూ మాట్లాడటాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అదేమన్నా అంటే ఎక్కడో ఏర్పాటు చేసిన డంపింగ్ కేంద్రాలను టీవీల్లో, ఫోన్లలో చూపిస్తూ డంపింగ్ కేంద్రం వల్ల అసలు వాసన రాదంటూ అధికారులు చెప్పడం సరైనది కాదన్నారు. అధికారులు, పాలకులు ఎవరైనా ప్రజాభీష్టం మేరకే ముందుకు వెళ్లాలని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. అసలే పీకలవాగు వల్ల మురుగు, చెత్తాచెదారం పేరుకుపోయి వచ్చే దుర్గంధంతో ఒక్కోసారి ఇక్కడి ప్రజలు అన్నం కూడా తినటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నుంచి వచ్చే విపరీతమైన చెడు వాసనతో స్థానిక ప్రజలు ఉబ్బసం వంటి శ్వాసకోస వ్యాధుల బారిన పడే ప్రమాదముందని, కిడ్నీ, లివర్ లు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్నది వర్షాకాలం కావటంతో దోమలు విపరీతంగా ఉండటంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని క్షణక్షణం భయపడుతూ బ్రతుకుంటే మూలికే నక్కపై తాటికాయ పడ్డట్టు ఎక్కడెక్కడో చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు పంతాలకు పోకుండా చెత్త కేంద్రాన్ని నివాస గృహాలకు దూరంగా ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రజల భాగస్వామ్యంతో ఆందోళనలు చేపడతామని ఆళ్ళ హరి హెచ్చరించారు. అనంతరం నగరపాలక సంస్థలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో ఈ ఈ కొండారెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. కమీషనర్ కీర్తి చేకూరి డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొలసాని బాలకృష్ణ, సయ్యద్ షర్ఫుద్దీన్, బాలయ్య, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.