‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో మొక్కలు నాటండి.. అభిమానులకు మెగా సందేశం

ఆగస్ట్‌ 22.. మెగా అభిమానులకు ఇది పండగ రోజు. తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టిన రోజు వేడుకని ఘనంగా జరుపుకుంటారు. రక్తదానం, అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఎక్కడివారక్కడే సేవా కార్యక్రమాలు చేయాలని చిరంజీవి విజ్ఞప్తి చేస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న తన అభిమానులంతా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలని పిలిపునిచ్చారు.

‘ నా పుట్టినరోజు సందర్భంగా మూడు మొక్కలు నాటాలని నా అభిమానులందరినీ కోరుతున్నాను. ఆ విధంగా నాపై మీ ప్రేమను చాటుతారని భావిస్తున్నాను. అంతేకాదు, ‘హరా హై తో భరా హై’ హ్యాష్ ట్యాగ్ ను పెట్టి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కు మద్దతు పలకండి” అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

చిరంజీవి చేసిన ట్వీట్ కు ఎంపీ సంతోష్ కుమార్ స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ పిలుపుకు ఆశేష అభిమానగణం తరలివచ్చి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారని విశ్వసిస్తున్నాను. మీ సామాజిక స్పృహ దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల అభినందనలు అందుకుంటుంది. ప్రకృతి మరింత ప్రేమాస్పదంగా మారేందుకు మీ చర్య తోడ్పడుతుంది. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులు అలరించాలని ఆకాంక్షిస్తున్నాను’అని సంతోష్‌ ట్వీట్‌ చేశారు.