కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారo: విజయ్‌ దేవరకొండ

శుక్రవారం సినీ హీరో విజయ్‌దేవరకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్లాస్మా దాతలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఘనంగా సన్మానించారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 126 మంది ప్లాస్మాయోధులను సత్కరించారు.

ఈ సందర్బంగా సినీహీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ప్లాస్మా దానం చేసి కోవిడ్‌ బాధితులను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రస్తుత సమయంలో  ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేయాలని కోరారు. కరోనా కేసుల కంటే ప్లాస్మా దానాల సంఖ్య ఎక్కువగా ఉండాలని ఆయన అన్నారు. రక్త, ప్లాస్మాదానంపై సైబరాబాద్‌ పోలీసుశాఖ ఎంతో కృషి చేస్తుoదన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా విజయ్‌దేవరకొండ, సజ్జనార్‌ చేతుల మీదుగా ప్లాస్మాదానం పై రూపొందించిన వాల్‌పేపర్స్, ఆన్‌లైన్‌ పోర్టల్‌ లింక్, ఫోన్‌ నంబర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏడీసీపీ మానిక్‌రాజ్, ఏడీసీపీ మాదాపూర్‌ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ క్రైమ్‌ ఇందిరాన, ట్రాఫిక్‌ ఫోరమ్‌ ప్రతినిధి వెంకట్‌టంకశాల మొదలైనవారు పాల్గొన్నారు.