*జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, విప్ నాయకర్
నరసాపురం మండలంలోని పి.ఎం.లంక గ్రామం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో, డెలాయిట్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను శనివారం నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కేంద్ర మంత్రివర్యుల వ్యక్తిగత కార్యదర్శి అనిరుధ్ ఎస్. పులిపాక పరిశీలించారు. పిఎం డిజిటల్ భవన్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను పరిశీలించిన అధికారులు, పిఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా యువతకు కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమై, వారు వ్యక్తపరచిన అభ్యర్థనలు — గ్రామమంతా ఉచిత సోలార్ ప్యానెల్స్, ఇల్లు లేనివారికి గృహాల నిర్మాణం వంటి అంశాలను గుర్తించి, కేంద్ర మంత్రివర్యులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామం ముంపు సమస్యపై డెలాయిట్ కంపెనీ రూ.13.75 కోట్లతో నిర్మిస్తున్న “జియో టెక్స్టైల్ ట్యూబ్ సీవాల్” పనులు అక్టోబర్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ గోడ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, నిర్మాణ పురోగతిపై సమాచారం సేకరించారు. గ్రామాభివృద్ధికి ప్రతి గ్రామస్థుడు భాగస్వామిగా ఉండాలన్న సందేశాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టంగా తెలిపారు. కేంద్ర మంత్రి కార్యదర్శి అనిరుధ్ మాట్లాడుతూ, నిర్మల సీతారామన్ గ్రామాభివృద్ధిపై గాఢ ఆసక్తి కలిగి ఉన్నారని, గ్రామస్తుల కోరిన అంశాలన్నీ ఆమె దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సహాయకులు విష్ణు సింగ్, ఆర్డీవో దాసిరాజు, జలవనరుల శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, డెలాయిట్ కంపెనీ ప్రతినిధులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment