సరయు నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ శనివారంనాడు ఘాఘ్ర, సరయు, రప్తి, బాన్‌గంగ, రోహిణి నదులను అనుసంధానిస్తూ రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. బలరాంపూర్ నుంచే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిన తన పార్లమెంటరీ జర్నీ ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.
బలరాంపూర్ ప్రిన్స్‌లీ స్టేట్ మహారాజా పటేశ్వరి ప్రసాద్ సింగ్ సాహెబ్ పేరును ప్రస్తావిస్తూ, అయోధ్యలో రామాలయం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా, మహారాజా పటేశ్వర్ సింగ్ సాహెబ్ పేరు ప్రస్తావించకుండా ఉండలేమని అన్నారు. బలరాంపూర్ ప్రజలకు కళల పట్ల ఎంతో మమకారమని, నానాజీ దేశ్‌ముఖ్, అటల్ బిహారీ వాజ్‌పేయి రూపంలో ఇద్దరు భారతరత్నలను అందించారని ప్రశంసించారు. బలరాంపూర్‌తో వాజ్‌పేయికి విడదీయరాదని అనుబంధం ఉందని, వాజ్‌పేయి తొలినాళ్లలో ఆయనను చూసిన వారు ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అన్నారు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి జన్‌సంఘ్ అభ్యర్థిగా మూడు సీట్లలో పోటీ చేశారు. బలరాంపూర్ నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1962లో బలరాంపూర్, లక్నోల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 1967లో బలరాంపూర్ నుంచి మరోసారి పోటీచేసి గెలుపొందారు.