పెనుశాపంగా మారుతున్న పోల’వరం’!

*ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
*నత్తనడకన పనులు
*సగమైనా పూర్తికాని నిర్మాణం
* ప్రాజెక్ట్‌ అథారిటీ నివేదిక తేటతెల్లం
*అతీగతీ లేని పునరావాసం ఏర్పాట్లు
* నిర్వాసితులు కన్నీరు మున్నీరు

పోల‌వ‌రం ప్రాజెక్టు ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే కాదు, మొత్తం దేశానికే ప్ర‌తిష్టాప‌క‌మైన‌ది. ఉభ‌య‌ గోదావ‌రి జిల్లాల్లో ల‌క్ష‌లాది ఎక‌రాల‌కు సాగు నీరు, ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించ‌డంతో పాటు విద్యుదుత్ప‌త్తికి కూడా దోహ‌ద ప‌డే బ‌హుళ ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ప్రాజెక్టు ఇది. ద‌క్షిణ గంగ‌గా పేరొందిన గోదావ‌రి న‌దిపై నిర్మించే ఈ ప్రాజెక్టు వివ‌రాల‌న్నీ ఘ‌నంగానే ఉంటాయి. అయితే ఇంతటి ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలనే స్పృహ జగన్‌ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్నట్టుగా కునారిల్లుతున్నాయి.
ఓ పక్క పనుల నత్తనడక…
మరో పక్క ప్రాజెక్టు నిర్వాసితులు పునరావాసం లేక గగ్గోలు…
ఇంకో పక్క ప్రభుత్వపరమైన ఉదాసీనత…
దీనికి సాయం పెరిగిపోతున్న అంచనా వ్యయం…
వెరశి… బహుళార్థక ప్రయోజనాలు కల్పించే పోల’వరం’ కాస్తా పెను శాపంగా మారుతోంది!
తాజాగా జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో బయటపడిన వాస్తవాలను పరిశీలిస్తే… ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అడుగడుగునా ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందో అవగతమవుతుంది.
గత ఏడాది కాలంలో భూసేకరణ, పునరావాసం పనులు కేవలం 1.97 శాతం మాత్రమే జరిగాయి!
మొత్తం పనుల్లో ఏడాదిలో జరిగినవి 5.4 శాతం మాత్రమే!
అత్యంత ప్రధానమైన హెడ్‌వర్క్‌ పనుల్లో పురోగతి ఈ ఏడాది కాలంలో 0.99 శాతమే!
మొత్తం మీద ఇప్పటివరకు పూర్తయిన పనులు 47.96 శాతమే!
అంటే ప్రాజెక్టు పనులు సగం కూడా పూర్తి కాలేదు!
వాస్తవాలు ఇలా ఉంటే… ప్రభుత్వం మాత్రం పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటనలు జారీ చేస్తోంది.
*నిరర్థకమవుతున్న నిర్వాసితుల త్యాగం…
పోలవరం ప్రాజెక్టు కింద క‌ట్టే భారీ ఆన‌క‌ట్ట‌, దానికి ఇరు ప‌క్క‌లా నిర్మించే కాలువ‌ల వ‌ల్ల అనేక ప‌ల్ల‌పు ప్రాంతాలు నీటితో నిండిపోతాయి. అలా మునిగిపోయే ప్రాంతాల్లో వంద‌లాది గ్రామాలు కూడా ఉన్నాయి. వాటిలో అనేక గిరిజ‌న గ్రామాలు, సామాన్య గ్రామాలు కూడా ఉన్నాయి. మొత్తం 222 రెవెన్యూ గ్రామాల‌కు చెందిన 373 గ్రామాలు ముంపున‌కు గుర‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. ఆయా గ్రామాల్లో ఉండే ల‌క్ష‌కు పైగా కుటుంబాల వారిని వేరే చోట్లకు త‌ర‌లించాల‌ని ప్ర‌తిపాదించారు. క‌చ్చితంగా చెప్పాలంటే 1,06,006 కుటుంబాల వారు తర‌త‌రాలుగా ఉంటున్న త‌మ ఊరిని, సొంత ఇళ్ల‌ని, చెట్టు చేమ‌ల్ని వ‌దులుకుని వ‌ల‌స పోవాలి. ఇంత మంది నిర్వాసితులుగా మారే ఒక ప్రాజెక్టును నిర్మించాల‌ని త‌ల‌పెట్ట‌డం దేశంలోనే ఇదే ప్ర‌థ‌మం. ప్రాజెక్టు ప‌రంగా నిర్వాసితులుగా మారే వారి కోసం వేరే ప్రాంతాల్లో కాల‌నీలు క‌ట్టించాల‌ని, వారికి ప‌రిహారాలు అందించి వాటిలోకి త‌ర‌లించాల‌ని సంక‌ల్పించారు. ఆ మేర‌కు అధికారులు ఆయా ప్రాంతాల‌ వారంద‌రినీ క‌లిసి గ్రామాలు ఖాళీ చేస్తే ల‌క్ష‌లాది రూపాయ‌ల ప‌రిహారంతో పాటు, స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన ప‌క్కా కాల‌నీల‌లో నివాసం అందిస్తామ‌ని హామీలు ఇచ్చారు. వాళ్ల ఇళ్లు, పొలాల ప‌రిధిలో ఉండే చెట్ల‌కు కూడా ప‌రిహారం ఇప్పిస్తామ‌ని చెప్పి ఒప్పించారు. ఫ‌లితంగా ఆయా గ్రామాల్లో ఉన్న గిరిజ‌నులు, సామాన్యులు త‌మ ఆస్తుల్ని ఉన్న‌ప‌ళంగా త్యాగం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. అంతేకాదు, త‌మ పొలాల‌ని, ఇళ్ల‌ని కూడా ప్రభుత్వానికి అప్ప‌గించారు. కానీ వారందరి త్యాగం నిరర్ధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు వారికి కాల‌నీలు నిర్మించ‌డంలోను, ప‌రిహారం అందించ‌డంలోను జ‌రుగుతున్న తీవ్ర‌మైన ఆల‌స్యం, వాళ్ల త్యాగాన్ని ప‌రిహాసం చేస్తోంది. పొలాల్ని అప్ప‌గించ‌డం వ‌ల్ల వీరిలో చాలా మందికి ఉపాధి లేకుండా పోయింది. ఊళ్ల‌కి ఊళ్ల‌లో ఇదే ప‌రిస్థితి కాబ‌ట్టి వాళ్లకి కూలి ప‌ని కూడా దొర‌క‌ని దుస్థితి చాలా చోట్ల క‌నిపిస్తోంది. అయితే ఏళ్లు గ‌డిచిపోతున్నా వాళ్ల‌కి క‌ట్టి ఇస్తామ‌న్న కాల‌నీల ప‌ని పూర్తికాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు నిర్వాసితుల్లో అత్య‌ధికుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది.
*చేష్ట‌లుడిగిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం
పోల‌వరం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు ఇచ్చే ప‌రిహారాన్ని ప‌ది ల‌క్ష‌లకు పెంచుతాన‌ని వైకాపా అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. వాళ్ల‌కి స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన కాల‌నీల నిర్మాణాన్ని త్వ‌రితంగా అంద‌జేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికారు. “ఆ మాట‌ల్ని న‌మ్మి మేమంద‌రం ఓటేసి గెలిపించాం. కానీ మూడేళ్ల‌వుతున్నా మా ప‌రిస్థితి మార‌లేదు” అంటూ ఇప్పుడు పోల‌వ‌రం నిర్వాసితులు బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. విమ‌ర్శించ‌డ‌మే కాదు నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు సైతం చేశారు. అయిన‌ప్ప‌టికీ వాళ్ల దుస్థితికి ఇప్ప‌టికీ అతీగ‌తీ లేదు. నిర్వాసితుల్లో అత్య‌ధికులు కొండ‌ల‌పైకి వెళ్లి తాత్కాలిక గుడిసెలు వేసుకుని కాల‌క్షేపం చేస్తున్నారు. కార‌ణం వీరికోసం నిర్మిస్తామ‌న్న కాల‌నీల‌లో ప‌నులు న‌త్త న‌డ‌క సాగుతుండ‌డ‌మే. చాలా మంది అసంపూర్తిగా నిర్మించిన కాల‌నీల‌కే వెళ్లి అర‌కొర వ‌స‌తుల మ‌ధ్య అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. చాలా కాల‌నీల‌లో ఇళ్ల‌కు త‌లుపులు లేవు. స్నానాల గ‌దుల‌కు సైతం గుమ్మాలు పెట్ట‌కపోవ‌డంతో త‌డిక‌లో, చీర‌లో అడ్డం పెట్టుకుని అవస్థ‌లు ప‌డుతున్న కుటుంబాలు వేల‌ల్లో ఉన్నాయి. పోనీ ప‌రిహార‌మైనా అందిందా అంటే, అదీ అంతంత మాత్ర‌మే. ఇది జాతీయ ప్రాజెక్టు కాబ‌ట్టి ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం, అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా నిధుల‌ను స‌మ‌కూర్చాల్సి ఉంది. కానీ కాల‌నీల నిర్మాణంలో, ప‌రిహారం అంద‌జేత‌లో ప్ర‌గ‌తిని చూపించి పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీకి నివేదిస్తేనే, కేంద్రం ఆ మేర‌కు నిధుల‌ను విడుద‌ల చేస్తుంది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయాల్సిన పనుల‌లోనే తీవ్ర‌మైన జాప్యం, నిర్ల‌క్ష్యం, బాధ్య‌తారాహిత్యం ఎదురవుతుండ‌డంతో నిర్వాసితుల బాధ‌లు తీర‌డం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు ప‌నుల‌న్నీ యుద్ధ‌ప్రాతిప‌దిక మీద పూర్తి కావ‌ల‌సి ఉంటుంది. అలా జ‌రిగిన‌ప్పుడే నిధుల విడుద‌ల స‌క్ర‌మంగా జ‌రిగి ప్రాజెక్టు ప్ర‌యోజ‌నం నెర‌వేర‌డంతో పాటు, నిర్వాసితుల బాధ‌లు కూడా తీరుతాయి. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ప‌డిపోయిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం, త‌న ప‌రిధిలో జ‌ర‌గాల్సిన ప‌నుల సంగ‌తి చూసుకోకుండా, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీదే త‌ప్పంతా నెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఫ‌లితంగా ప్రాజెక్టు ప‌నుల్లో దాదాపు ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత‌వ‌ర‌కు నిర్వాసితుల సామాజిక‌, ఆర్థిక సర్వే సైతం పూర్తి కాలేదు. కాల‌నీల కోసం, నిర్వాసితుల‌కు అందించ‌డం కోసం త‌ల‌పెట్టిన ప్ర‌త్యామ్నాయ భూసేక‌ర‌ణ కూడా అతీగ‌తీ లేకుండా ఉంది. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం పోల‌వ‌రం, గోపాల‌పురం, కొయ్య‌ల‌గూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, దేవీప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల్లో కాల‌నీల నిర్మాణాన్ని చేప‌ట్టినా ఒక్క కాల‌నీలో కూడా స‌దుపాయాలు స‌రిగా లేక‌పోవ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిష్క్రియాప‌ర‌త్వానికి, ఉదాసీన‌త‌కి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది.
*అంచ‌నాలు ఆకాశానికి… ఆచ‌ర‌ణ పాతాళానికి….
ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టు అంచ‌నాలు మాత్రం అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. 2017-18 నాటి ధ‌ర‌ల ప్ర‌కారం ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం 55,656.87 కోట్ల రూపాయ‌లు. ఈ మేరకు అంచనా నివేదికను కేంద్రానికి పంపారు. అయితే అంచనాలను 2013-14 నాటి ధరల ప్రకారమే చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. అదే జరిగితే తాజా అంచనాల్లో సగం కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కచ్చితమైన లెక్కలు, వ్యయానికి సంబంధించిన వివరాలు, ఇతర అంశాలను క్రోడీకరిస్తూ, ఎటువంటి సందేహాలు తలెత్తని విధంగా సమగ్రమైన నివేదికను రూపొందించి పంపితే ఫలితం ఉంటుంది. అయితే ఉదాసీనత పేరుకుపోయిన జగన్‌ ప్రభుత్వం హయాంలో అలాంటి నిర్దిష్టమైన ప్రయత్నమేదీ జరగకపోవడం పెద్ద లోపంగా పరిణమిస్తోంది.
ఏకంగా 2.91 ల‌క్ష‌ల హెక్టార్ల భూమికి సాగునీటిని, 540 గ్రామాల ప్ర‌జ‌ల‌కు తాగునీటిని అందించ‌డంతో పాటు 960 మెగావాట్ల విద్యుదుత్ప‌త్తిని సాధ్యం చేసే ఈ భారీ ప్రాజెక్టు క‌థ ఎప్ప‌టికి ఓ కొలిక్కి వ‌స్తుంద‌నేది అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా మిగిలింది. ఇందుకు జ‌వాబుదారీ మాత్రం పూర్తిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వానిదే అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.