నిఖిల్ ను అడ్డుకున్న పోలీసులు.. మెడికల్‌ ఎమర్జెన్సీ అన్నా వదల్లేదు

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుండి హైదరాబాద్ పోలీసులు లాక్డౌన్ సమయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సేవలను కూడా అనుమతించడం లేదు. అయితే ప్రభుత్వ లాక్డౌన్ మార్గదర్శకాలలో ఆహార పంపిణీని ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ నిన్న ‘లాక్‌డౌన్ నిబంధనలను’ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫుడ్ డెలివరీ అబ్బాయిలను పోలీసులు కొట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు అత్యవసరమైన వైద్య సామాగ్రి పంపిణీ చేయడానికి వెళ్లిన నటుడు నిఖిల్ వాహనాన్ని పోలీసులు ఆపారు. పోలీసుల వైఖరికి నిఖిల్ షాక్ అయ్యాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘ఉప్పల్ టు కిమ్స్ మంత్రి రహదారి. అత్యవసర ప్రాణాలను రక్షించే మందులను పంపిణి చేయడానికి వెళ్ళాను. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ నన్ను ఆపి ఈపాస్ తీసుకురమ్మని అడిగారు. 9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని నేను అనుకున్నాను !!!’ అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.