వివేక్‌ ఒబెరాయ్‌ ఇంట్లో పోలీసుల సోదాలు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు జరిపారు. శాండిల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో నిందితుడు ఆదిత్య అల్వా వివేక్ బంధువు. ఆదిత్య అల్వాకి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చేపట్టాం. మాకు వచ్చిన సమాచారం ప్రకారం అల్వా.. వివేక్ ఇంట్లో ఉన్నాడని సమాచారం అందడంతో క్రైమ్ బ్రాంచ్ టీం కోర్టు వారెంట్ తీసుకొని ముంబైలోని వివేక్ ఇంట్లో సోదాలు జరిపిందని బెంగళూరు జాయింట్ కమీషనర్ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. కోర్టు వారెంట్‌ తీసుకున్న తర్వాతే క్రైం బ్రాంచ్‌ పోలీసులు వివేక్‌ ఇంటికి వెళ్లారని సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.

ఆదిత్య అల్వా.. కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు కాగా, శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆయన హస్తం కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. శాండల్ వుడ్‌కి చెందిన సింగర్స్‌, యాక్టర్స్ కు ఆయన డ్రగ్స్ సప్లై చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.