న్యాయస్థానం సాక్షిగా పోలీసులే దొంగలుగా మారారు: కిరణ్ రాయల్

  • న్యాయమూర్తికి తెలియకుండా నా ఫోన్లు ఎత్తుకెళ్లారు
  • ఫోన్లో సమాచారం బయటకు వస్తే చర్యలు తప్పవని జడ్జి గారే హెచ్చరించారు
  • ఫోన్లు ఎఫ్.ఎస్.ఎల్.కి పంపడంపై గౌరవ హైకోర్టు స్టే ఇచ్చింది
  • వైసీపీలో చేరాలని నగరి సి.ఐ. వేధింపులు
  • ప్రాణం ఉన్నంత వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే నా ప్రయాణం
  • విజయవాడ మీడియా సమావేశంలో జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్

విజయవాడ: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా న్యాయస్థానంలో పోలీసులు దొంగతనం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. న్యాయమూర్తికి తెలియకుండా అక్కడి ఉద్యోగిని మభ్యపెట్టి నా రెండు మొబైల్ ఫోన్లను దొంగలించడం సిగ్గుచేటని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే న్యాయస్థానంలో పోలీసులు దొంగతనానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లో డేటా బయటకు వస్తే సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నగరి న్యాయస్థానం న్యాయమూర్తే ఆదేశాలు జారీ చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవాలన్నారు. తన ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలనే పోలీసుల ప్రయత్నంపై గౌరవ హైకోర్టు స్టే విధించిందని తెలియచేశారు. బుధవారం సాయంత్రం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ మంత్రి రోజాపై విమర్శలు చేసినందుకు ఈ నెల 11న నేను ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. అరెస్టు అక్రమమని న్యాయమూర్తి గుర్తించడం వల్లే బెయిల్ ఇచ్చి నన్ను పంపించేశారు. అరెస్టు సమయంలో నా రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీలో చేరాలని లేకపోతే నీ అంతు చూస్తామని గత 15 రోజుల నుంచి నగరి సి.ఐ. వేధిస్తున్నారు. ఆమె నాతో ఉన్న జనసేన నాయకులను కూడా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

  • న్యాయస్థానంలోనే దొంగతనం చేశారు

నా దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లు నాకు ఇప్పించాలని నగరి కోర్టులో పిటీషన్ వేశాను. మంత్రి గారిని విమర్శించిన డేటా ఆ ఫోన్లో ఉంది. వాటిని సేకరించాకా ఇస్తామని పోలీసులు సమాధానం చెప్పారు. దానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. రోజాపై చేసిన విమర్శలు యూట్యూబ్, ఫేస్ బుక్ లో ఉన్నాయి. నా మొబైల్ ఫోన్లతో పనేంటి అని హైకోర్టులో పిటీషన్ వేశాను. మరో వైపు పోలీసులు నగరి న్యాయమూర్తి గారు భోజనం విరామ సమయంలో అక్కడి ఉద్యోగిని మోసం చేసి మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు. దేశ చరిత్రలో మొదటిసారి పోలీసులు న్యాయ స్థానంలో దొంగతనం చేశారు. మొబైల్ ఫోన్ నుంచి ఎటువంటి సమాచారం బయటకు వచ్చినా సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొంటామని సాక్షాత్తూ న్యాయమూర్తి గారే మెమో జారీ చేశారు. న్యాయస్థానంలో దొంగతనం చేస్తే మోమో ఇస్తారు, సస్పెండ్ చేస్తారనే ఆ సి.ఐ.కు తెలుసు.. తెలిసే తాడేపల్లి ప్యాలస్ ఆదేశాల మేరకే బరి తెగించి మొబైల్ ఫోన్లు దొంగతనం చేశారు.

  • పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

కిరణ్ రాయల్ ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇదే పనిగా వైసీపీ నాయకులు పెట్టుకున్నారు. నిజంగా జగన్ గారికి నా మీద ఎందుకంత ఆదుర్దా. అలాగే టీటీడీలో ఒక అధికారి తన పని పక్కన పెట్టి మరీ నా గురించే ఆలోచిస్తున్నాడు. ఒక ఎస్.పి. పర్యవేక్షణలో నా మొబైల్ ఫోన్ ను ఓపెన్ చేశారు. అందులో డేటాను చోరీ చేశారు. దానిని సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వీటిని త్వరలోనే కోర్టులో సబ్మిట్ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తాం. వైసీపీ నాయకులకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాలసీపై నాతో మాట్లాడాలి. అంతే తప్ప నాయకులను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేసేలా పోలీస్ వ్యవస్థను ఉపయోగించడం కాదు. నా కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. నా మొబైల్ ఫోన్ లో ఉన్న సమాచారం బయటకు వచ్చిందో… డీఎస్పీతో పాటు సి.ఐ. ఇద్దరు కానిస్టేబుల్స్ ను కోర్డుకు ఈడుస్తాన ని హెచ్చరించారు.

  • డీజీపీ గారు చర్యలు తీసుకోండి: పోతిన వెంకట మహేష్

జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ… మా పార్టీ నాయకులు శ్రీ కిరణ్ రాయల్ మీద పోలీసుల వేధింపులు తక్షణమే ఆపేయాలి. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప… వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదేశాల మేరకు కాదు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేసి ఉంటే ఈ రోజు పోలీసులు… పోలీసుల్లా ఉండేవారు. కానీ వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేయడంతో పోలీసులు… దొంగల్లా మారాల్సిన పరిస్థితి వచ్చింది. త్వరలోనే పోలీసులకు న్యాయస్థానంలో శిక్ష పడుతుందనే అనుమానం కూడా మాకు కలుగుతోంది. స్వయంగా న్యాయమూర్తి గారే రెండు ఫోన్లను తీసుకొచ్చి కోర్టులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారంటే పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేశారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రి చేసిన అవినీతిని ప్రశ్నిస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?.. కిరణ్ రాయల్ గారు అడిగిన అన్ని ప్రశ్నలకు చిత్తూరు జిల్లా నాయకులు సమాధానం చెప్పాలి. తిరుమల లాంటి పుణ్యక్షేత్రం దగ్గర్లోనే పెట్టుకొని ఇలాంటి పాపకార్యాలకు ఒడిగట్టడానికి మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే కిరణ్ రాయల్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప… పోలీసులతో నిర్భందించో, అక్రమంగా కేసులపెట్టో… రిమాండ్లు విధించో… సెల్ ఫోన్ దొంగలించే ఒత్తిడి చేయాలని చూస్తే… ఇలాంటి ఒత్తిడులకు భయపడే వ్యక్తి కిరణ్ రాయల్ కాదు. ప్రభుత్వ అవినీతిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పినట్లు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జరిగి తీరుతుంది. మా విప్లవ సేన చేతిలో వైసీపీ పరాభవం తప్పదు. ఇది తథ్యం. చెప్పులు లేకుండా వైసీపీ నాయకులను, మంత్రులను నడిపిస్తామని కిరణ్ రాయల్ గారు చెప్పారు. అది తప్పక జరుగుతుంది. సెల్ ఫోన్లు దొంగతనం విషయమై డీజీపీ గారు స్పందించాలి. సంబంధిత పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి. లేకపోతే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుందని అన్నారు.