హీరో రామ్ ను హెచ్చరించిన పోలీసులు

విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాద ఘటన పై హీరో రామ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదానికి దారితీసిన నేపధ్యంలో…విచారణకు అడ్డు తగిలితే నోటీసులు పంపిస్తామని హీరో రామ్ ను పోలీసులు హెచ్చరించారు.

విజయవాడ స్వర్ణప్యాలేస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఏసీపీ సూర్యచంద్రరావు నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటన లో డాక్టర్ రమేష్ ను వెనకేసుకుంటూ హీరో రామ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఏసీపీ తీవ్రంగానే స్పందించారు. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కు నోటీసులు పంపుతామని హెచ్చరించారు. బాబాయ్ ను కాపాడుకునేందుకు అసత్య ఆరోపణలు చేస్తే సహించమన్నారు. కోవిడ్ సెంటర్ కు క్వారెంటైన్ సెంటర్ కు తేడా తెలియదా అని ప్రశ్నించారు. మరోవైపు డాక్టర్ రమేష్ పై కూడా ఏసీపీ సూర్యచంద్రరావు తీవ్రంగానే స్పందించారు. కలెక్టర్ కార్యాలయం వరకూ వచ్చి అక్కడ్నించి పరారవడంపై ఆయన మాట్లాడారు. విచారణకు హాజరుకాకుండా…పరారైపోయి ఫోన్ లు ఆఫ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పది మంది ప్రాణాలు పోతే బాధ్యతారాహిత్యంగా ప్రదర్శించడంపై ఏసీపీ మండిపడ్డారు. పరారీలో ఉండి  ఆడియో టేపులు విడుదల చేస్తూ విచారణకు సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. విచారణకు హాజరుకావల్సిందేనని స్పష్టం చేశారు.