వరద సాయం పేరుతో కేసీఆర్ ఓట్ల రాజకీయం

వరద సాయం పేరుతో సీఎం కేసీఆర్‌ ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ప్రస్తుతం పరిణామాలను చూస్తుంటే గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయింది. టీఆర్‌ఎస్‌ నేతలు సూచించినవారికి మాత్రమే.. అదీ చాలావరకూ అరకొరగా ఇచ్చి, నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారు. ఇప్పుడు బల్దియా ఎన్నికలు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే… ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమే. టీఆర్‌ఎస్‌ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపమని ఆదేశిస్తే.. ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామని చెప్పడం కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగమే. ఈ పరిస్థితులను చూస్తుంటే ఇదంతా ప్రభుత్వం చేతగానితనం కంటే గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు అంటూ మండిపడ్డారు విజయశాంతి.