చెరువులను కబ్జాదారుల చెర నుండి విడిపించాలి!

  • రాజ్యాంగం కల్పించిన విధులను విస్మరిస్తున్న అధికారులు
  • రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయం అధికారులకు బుద్ధిని ప్రసాదించండి
  • పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా చేయండి

పార్వతీపురం: అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు చెరువులను కబ్జాదారుల చెర నుండి కాపాడాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు కోరారు. బుధవారం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రైతు బజార్ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి కబ్జాదారులు చేర నుండి చెరువులను పరిరక్షించేలా అధికారులకు బుద్ధిని ప్రసాదించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని లక్ష్మునాయుడు చెరువు, నెల్లిచెరువు, కోదు వాని బంధ, లంకెల చెరువు, దేవుడి బంధ ఇలా చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయన్నారు. వీటితోపాటు జిల్లాలో దాదాపు చెరువులన్నీ అక్రమార్కుల ఆక్రమణలతో బందీగా ఉన్నాయన్నారు. అధికారుల కళ్ళముందే ప్రభుత్వ ఆస్తులను కబ్జాచేసి చెరువుల్లో పక్కా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయ, పంచాయతీ అధికారులు సిబ్బంది కనీసం స్పందించడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొద్ది కాలంలో చెరువులు కనిపించే పరిస్థితి ఉండదన్నారు. అప్పుడు మానవాళికి పెను ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, తుపానులు, వర్షాలు ఏడబాటు, రుతువుల తడబాటు తదితర అతివృష్టి అనావృష్టి చేకూరుతుందన్నారు. అలాగే జల చక్రం గతి తప్పి భావితరాలకు తాగునీరు కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. జలజీవరాశులు తాగునీటికి అలమటించే రోజులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదంతా అధికారుల అలసత్వం వల్లే జరుగుతోందన్నారు. కాబట్టి రాజ్యాంగం కల్పించిన విధులను విస్మరిస్తున్న అధికారులకు బుద్ధి ప్రసాదించాలని కోరారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని ప్రజలకు ఇస్తే, ఉద్యోగులు దానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. చెరువులను రక్షించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆయా శాఖల అధికారులు పనిచేసేలా వారికి బుద్ధిని ప్రసాదించాలని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేడుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రతికున్న ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తే ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇలాగైనా ఆయా శాఖల అధికారులకు బుద్ధి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.