నిర్మాత అశ్వనీదత్‌ పిటిషన్‌ విచారణ వేరే బెంచ్‌కు బదిలీ

గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తాము ఇచ్చిన 39.15 ఎకరాలకు భూసేకరణ చట్టప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్‌ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ వేరే బెంచీకి బదిలీ అయింది. హైకోర్టు ఈపిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ ఈ వ్యాజ్యం సింగిల్‌ జడ్జి బెంచ్‌ ముందుకు విచారణకు రావాల్సి ఉందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యాన్ని పరిశీలించి తగిన బెంచ్‌ వద్దకు విచారణకు వచ్చేలా నిర్ణయం తీసుకునేందుకు ఫైల్‌ను హైకోర్టు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.