గణేష్ ఉత్సవాలపై ఆంక్షలకు నిరసన ప్రదర్శనలు

రాష్ట్రంలో గణేష్‌ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తూ యువతను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ, విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ నగరంలో పలు చోట్ల సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఖైరతాబాద్‌ గణపతి విగ్రహం వద్ద నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావు, భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చందర్‌, ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ పాల్గొన్నారు. ఎంజే మార్కెట్‌ ముఖ్య కూడలి, జాంబాగ్‌, గోషామహల్‌, బేగంబజార్‌, గౌలిగూడల్లో ప్రదర్శనలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు గణేష్‌ ఉత్సవాలను జరుపుకునేందుకు అనుమతించాయని, తెలంగాణ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోఠీలోని వీహెచ్‌పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణేష్‌ ఉత్సవాల నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.