పట్టణానికి కూరగాయలు తెచ్చే రైతులకు నిలువ నీడ కల్పించండి

పార్వతీపురం, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని కోరిన జనసేన పార్టీ నాయకులు పార్వతీపురం పట్టణానికి ప్రతిరోజు కూరగాయలు, ఆకుకూరలు తెచ్చే రైతులకు కాసింత స్థలము, నిలువ నీడ కల్పించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ ని కలిసిన ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, సీతనగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు తదితరులు కలిసి పట్టణానికి కూరగాయలు, ఆకుకూరలు తెచ్చే రైతుల సమస్యలు గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు పార్వతీపురం పరిసర ప్రాంతాలైన కొమరాడ, కల్లికోట, కుమ్మరిగుంట, కందివలస, గంగరేగువలస, గరుగుబిల్లి, బాలగుడబ, నర్సిపురం తదితర ప్రాంతాల నుండి ప్రతి రోజు ఉదయం 4, 5 గంటలకే రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు పార్వతీపురం పట్టణానికి తీసుకువస్తారన్నారు. వారికి తెచ్చే కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునేందుకు నిలువ నీడ లేక, నిలుచునేందుకు కాసింత స్థలం లేక, పాత బస్టాండు రాయగడ రోడ్డు జంక్షన్ లో రోడ్డుపై అమ్మకాలు చేస్తుంటారన్నారు. ఆంధ్ర, ఒడిస్సాకు రాకపోకలు సాగించే భారీ వాహనాల రద్దీ నడుమ వీరు రోడ్డుపై కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం వల్ల తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. అలాగే కూరగాయలు, ఆకుకూరలు అమ్మకమైనంతవరకు దాదాపు ఉదయం 11 గంటల వరకు రోడ్డుపై ఎండ, వాన, చలికి ఓర్చుకొని రైతులు ఉండే పరిస్థితి అన్నారు. ఆ సమయంలో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, షెడ్లు నిలువ నీడ లేకపోవడంతో రైతుల బాధలు, ముఖ్యంగా మహిళ రైతులు బాధలు చెప్పలేనివి అన్నారు. గతంలో రైతులకు షెడ్లిచ్చి, ఆయా షేడ్స్ లో వారు కూరగాయలు, ఆకుకూరలు అమ్మకమైనంతవరకు ఉండేందుకు మున్సిపాలిటీ ఆశీలు వసూలు చేసేది అన్నారు. ఇప్పుడు మాత్రం ఆశీలు వసూలు చేస్తున్నారే తప్ప రైతులకు తగు సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఇది ఇలా ఉండగా అటవీ ఫలసాయాన్ని అమ్మకానికి తీసుకువచ్చిన గిరిజనుల నుండి కూడా ఆశీలను వసూలు చేస్తున్నారని, గిరిజనులకు మినహాయివ్వాలని, దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

*నిడగల్లులో అక్రమ క్వారీని ఆపండి
అనంతరం డిఆర్ఓ వెంకట్రావును కలిసిన సీతానగరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావుతో పాటు జనసైనికులు
బత్తుల శ్రీను, బొత్స ధనుంజయ, బెవర వాసు, గంట సాయి తదితరులు గ్రామంలో సర్వే నెంబరు ఒకటిలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీని నిలుపుదల చేయాలని కోరారు. క్వారీ వలన గ్రామంలో ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, తక్షణమే ఆపాలన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.