సంక్రాంతి బరిలో పునర్నవి సైకిల్.. !

ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటించిన ‘సైకిల్‌’ విడుదలకు సిద్ధమైంది. అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాలం హీరోహీరోయిన్లుగా నటించారు. పి.రామ్‌ప్రసాద్‌, బాలాజీరాజు నిర్మాతలు. జీఎం సతీశ్‌ సంగీతం అందించారు. దర్శకుడు అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. సంక్రాంతికి మంచి కుటుంబ ప్రేమకథా చిత్రాన్ని చూసిన అనుభూతిని పొందుతారు. హీరోహీరోయిన్లతో పాటు అందరూ బాగా నటించారు. సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీలో మా సినిమా కూడా ఉంది. ఇది కచ్చితంగా భిన్నమైన చిత్రంగా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేయడంలో డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు.