పంజాబ్ సంఘటన దురదృష్టకరం: జనసేనాని

పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఎదురైన సంఘటనను దురదృష్ణకరంగా భావిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి అవాంఛనీయం. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని భావిస్తున్నాను. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధానమంత్రి గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాదు. ప్రధానమంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే. ఈ దుస్సంఘటన కావాలని చేసినట్లు నేను భావించడం లేదు. అయితే ప్రధానమంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది. ఇది సర్వవిదితమే. మరోసారి ప్రధానమంత్రికిగానీ, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన శ్రీ నరేంద్ర మోదీకి గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని జనసేనాని అన్నారు.