రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు

•అధికారుల స్పందనకు జనసేన డిమాండ్

సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామీణ నీటి సరఫరా పథకం (RWS) ద్వారా వెంకటాచలం పంచాయితీతో పాటు వెంకటాచలం మండలంలోని అనేక ప్రాంతాలలో ఈ ఏడాది రూ.లక్షల రూపాయలతో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీలు కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల కుప్పకూలాయి. సిమెంట్ రోడ్లపై కంకర తేలికనబడుతోంది. ఈ ఏడాది నిర్మాణం చేపట్టిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ప్రాంతాలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నేత శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబుతో పాటు పార్టీ నాయకులు పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం వల్లే నాణ్యతలేని నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు. బిల్లులు మంజూరు కాకముందే రోడ్లు, మురుగు కాల్వలు కొట్టుకోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. జిల్లా అధికారులు సత్వరమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన లోటుపాట్లను పూర్తి స్థాయిలో విచారించాలని అధికారులను కోరారు. వెంకటాచలం పంచాయతీతో పాటు వెంకటాచలం మండలం, సర్వేపల్లి నియోజకవర్గంలో అనేకచోట్ల అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో కాంట్రాక్టర్లు నాసిరకమైన సైడ్ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు నిర్మించారని మండిపడ్డారు. నాణ్యతాలోపాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, శ్రీ సందీప్, శ్రీ గిరీష్, శ్రీ వంశి, శ్రీ సాయి తదితరులు పాల్గొన్నారు.