* కూటమి ప్రభుత్వ చర్యలు భేష్
* గంజాయి సాగు నుంచి విముక్తి దిశలో రాష్ట్రం
* సత్ఫలితాలిస్తున్న సర్కారు పట్టుదల
* బహుముఖ వ్యూహంతో ముందడుగు
కన్న కొడుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా?
ఆ అలవాటును మాన్పించి కొడుకును మత్తు కోరల నుంచి కాపాడుకోవాలని చూస్తారు…
అది బాధ్యత తెలిసిన తల్లిదండ్రుల తీరు!
అదే తీరును ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనబరుస్తోంది…
ఒకప్పుడు గంజాయికి కేంద్ర స్థానంగా దేశవ్యాప్తంగా పడిన చెడు ముద్ర నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి సమకట్టింది.
బాధ్యతాయుతంగా బహుముఖ వ్యూహంతో ముందుకు సాగింది.
ఆ ఫలితాలు ఇప్పుడు రాష్ట్రంలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ మార్పు ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే గత వైకాపా ప్రభుత్వం హయాంలో పెచ్చు పెరిగిన గంజాయి సాగు గురించి గుర్తు తెచ్చుకోవాలి…
ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్ ప్రభుత్వం అందించిన సహకారం వల్ల విచ్చలవిడిగా సాగిన చీకటి వ్యాపారం విష పరిణామాలపై అవగాహన ఉండాలి…
అక్రమార్జనే లక్ష్యంగా వైకాపా ప్రజాప్రతినిధులు కొమ్ము కాసి పోషించిన అరాచక విధానాలను అర్థం చేసుకోవాలి…
స్కూళ్లలో, కాలేజీల్లో సైతం గంజాయి సులువుగా దొరికేలా దిగజారిన పరిస్థితుల దౌర్భాగ్యాన్ని గుర్తు చేసుకోవాలి…
కళ్ల ముందే పిల్లలు, యువకులు మత్తు రక్కసి గుప్పెట్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే నిస్సహాయంగా మిగిలిపోయిన తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవాలి…
దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైనా వాటి మూలాలు రాష్ట్రంలోనే ఉన్నాయని బయటపడిన సిగ్గు చేటు పరిపాలన మూలాలను తల్చుకోవాలి…
ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ముందుగా కొన్ని గణాంకాలను కూడా పరిశీలించాలి!
వైకాపా ప్రభుత్వం కొలువులో ఉన్నప్పుడు విశాఖ మన్యంలోని 11 మండలాల్లో విచ్చలవిడిగా సాగిన గంజాయి సాగు విస్తీర్ణం ఎంతో తెలుసా?
ఏకంగా 11 వేల ఎకరాలు!
వైకాపా నేతల కనుసన్నల్లో గంజాయి అక్రమ వ్యాపారులు దళారులుగా అవతారమెత్తి అమాయకులైన గిరిజన రైతులను సైతం ప్రలోభ పెట్టి గంజాయి సాగును ప్రోత్సహించారు. కొందరు వినకపోతే బెదిరించి మరీ గంజాయి సాగు చేయించిన ఉదంతాలు కోకొల్లలు. అలా పండిన వేలాది టన్నుల గంజాయిని యధేచ్ఛగా రవాణా చేశారు. ప్రభుత్వ పరోక్ష సహాయ సహకారాలు బాహాటంగానే కనిపిస్తుండడంతో పోలీసులు, తనిఖీ అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేయడంతో రాష్ట్రం నుంచి గంజాయి సరుకు దేశం నలుమూలలకే కాదు, విదేశాలకు సైతం సరఫరా అయిపోయింది.
ఈ నేపథ్యంలో వైకాపా ఘోర పరాజయం పొంది, కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించింది.
ఒకే ఒక్క ఏడాదిలో బహుముఖంగా చేపట్టిన చర్యల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి పంట సాగవుతున్న విస్తీర్ణం 100 ఎకరాలకు తగ్గిపోయింది!
ఎక్కడ 11 వేల ఎకరాలు? ఎక్కడ 100 ఎకరాలు?
* బహుముఖ వ్యూహం భళా!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అక్రమ మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
మొదటగా గంజాయి సాగు ఎక్కడెక్కడ జరుగుతోందో పాలకులు గుర్తించారు. దళారుల ప్రమేయంతో గంజాయి సాగు చేపట్టిన మన్యం రైతులను చైతన్య పరిచే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. తేలిగ్గా వచ్చే డబ్బులకు అలవాటు పడిన ఆయా రైతులకు గంజాయి సాగు చేస్తే తలెత్తే చట్టపరమైన కేసుల గురించి, పడే శిక్షల గురించి అవగాహన కలిగించారు.
మరో వైపు నుంచి గంజాయిని వదిలేస్తే ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయో, ఎన్ని విధాలుగా ఉంటాయో అర్థం అయ్యేలా వివరించారు.
మరో వైపు గంజాయి సాగును ప్రోత్సహించే దళారులు, అక్రమ వ్యాపారుల ఆనుపానులను కనిపెట్టి వారిని ఎక్కడికక్కడ నివారించారు. ఇందుకోసం ప్రభుత్వం పోలీసు, నిఘా, రవాణా అధికారులను నియమించడంతో పాటు, ఇతర ప్రభుత్వ శాఖలను సైతం సమన్యయం చేసి ఉమ్మడి కార్యాచరణ అవలంబించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సాగును అరికట్టడం కోసం ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించి, ఆయా అధికారులకు విస్తృత అధికారాలు కల్పించారు.
మన్యంలోని పదకొండు మండలాల్లో ఎన్ని సార్లు చెప్పినా గంజాయి సాగు మానని 375 కుటుంబాలను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. వారికి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల గురించి తెలియజేసి అందుకు ప్రభుత్వ పరంగా సహకారం కూడా అందేలా చర్యలు తీసుకున్నారు.
గతంలో గంజాయి సాగుకు అలవాటు పడిన రైతులందరికీ ఐటీడిఏ, ఇతర శాఖల అధికారుల ద్వారా 22 రకాల వాణిజ్య పంటల విత్తనాలను ఉచితంగా అందే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంగా రూ. 142 కోట్లను వెచ్చించింది.
ఎంత చేసినా మారు మూల మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించి దాన్ని సైతం నివారించడానికి ఆధునిక సాంకేతిక సహకారాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. డ్రోన్ల సాయంతో ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో ఇప్పుడు ఎలాంటి పంటలు వేశారు, ప్రభుత్వం అందించిన వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారా లేదా లాంటి వివరాలను డ్రోన్ల సాయంతో గుర్తించి ఆయా ప్రదేశాలను అధికారులు చేరుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ గంజాయి సాగు కనిపించినా దాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేసి తగలబెట్టేస్తున్నారు.
ప్రభుత్వ పాలనలో ఇలాంటి మార్పును గమనించిన రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి పంటలను తమంతట తామే తగలబెట్టుకుంటున్న చైతన్యం మన్యంలోని అనేక ప్రాంతాల్లో ద్యోతకమవుతోంది.
ఇన్ని కోణాల నుంచి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఎక్కడో మారుమూల ఏ 100 ఎకరాల్లోనో తప్పించి మరెక్కడా గంజాయి సాగనేది లేకుండా పోయింది. అలాగే ఒడిశాలోని కోరాపుట్, మల్కన్‌గిరి, గంజాం, గజపతి తదితర జిల్లాల నుంచి గంజాయి సరుకు రవాణా అవుతోందన్న సంగతి గమనించి ఈగల్ విభాగం అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒడిశా అధికారులతో కూడా చర్చలు, సమావేశాలు జరిపేలా ముందడుగు వేస్తున్నారు.
Share this content:
Post Comment