జగనన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ కు మరో లేఖ రాసిన రఘురామ

ఏపీ  ముఖ్యమంత్రికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వరుసగా లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జగన్ కు మరోలేఖ రాశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని… వారికి మంచి ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ల స్థానంలో జగనన్న క్యాంటీన్లను తెరవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని చేపడితే మీకు మంచి పేరు వస్తుందని… దైవదూత అనే పేరు జనాల్లో స్థిరపడిపోతుందని చెప్పారు.

వెంటనే జగనన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించాలని రఘురాజు కోరారు. వైయస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న పేరుతో క్యాంటీన్లను ప్రారంభించాలని అన్నారు. పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమం మానవత్వాన్ని ప్రదర్శించేందుకు మంచి వేదిక అవుతుందని చెప్పారు.

గత ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, ఆహారాన్ని అందించే బాధ్యతను ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే అక్షయపాత్ర ఫౌండేషన్ కు అప్పగించిందని రఘురాజు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… అక్షయపాత్రకు ఆర్డర్లను క్రమంగా తగ్గిస్తూ, ఆ తర్వాత పూర్తిగా మూసేసిందని విమర్శించారు.

కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయని… ఏపీ ప్రభుత్వం మాత్రం నిరాశ్రయులను గాలికి వదిలేసిందని అన్నారు. త్వరలోనే క్యాంటీన్లను తెరుస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని… ఆయన మాటలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు.