7 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్థాన్ విజయం

లీగ్‌ స్టార్టింగ్‌లో తడబాటుకు గురైనా.. కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన రాజస్తాన్‌ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (30 బాల్స్‌లో 4 ఫోర్లతో 35 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ధోనీ (28 బాల్స్‌లో 2 ఫోర్లతో 28) ఫర్వాలేదనిపించాడు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని టార్గెట్ ఛేదించింది.

రాయల్స్‌ బౌలర్లు ఇచ్చిన శుభారంభాన్ని వమ్ము చేయకుండా.. బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌ (48 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో దుమ్మురేపాడు..! ఫలితంగా చిన్న టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది..! మరోవైపు చెన్నై స్టార్లందరూ బ్యాటింగ్‌లో ఘోరంగా తేలిపోవడంతో ఏడో ఓటమితో ప్లే ఆఫ్‌ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.