కూతురు దర్శకత్వంలో రజనీకాంత్!

రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం కలిగినా చాలు అనుకునే దర్శకులు చాలామందే ఉంటారు. రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను రూపొందించడమే ఆశయంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దర్శకులు కూడా ఉన్నారు. అయితే ఒకప్పుడు రజనీకాంత్ ను కలవడం .. కథ చెప్పి ఒప్పించడం అంతతేలికైన విషయంగా ఉండేది కాదు. రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేస్తూ వెళ్లారు. అలాంటి రజనీకాంత్ ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ వెళ్లారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.

రజనీకాంత్ తాజా చిత్రంగా ‘అన్నాత్తే’ రూపొందుతోంది. ఈ సినిమాలోను రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనే రజనీ ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం. ఈ దీపావళికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుంది? అది ఎప్పుడు మొదలవుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో రజనీ తన తదుపరి సినిమాను కూతురు సౌందర్య దర్శకత్వంలో చేయాలనుకుంటున్నారట. ఆ తరువాత ఇక విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సౌందర్య పూర్తిచేసిందని అంటున్నారు. అమెరికా నుంచి రజనీ తిరిగి రాగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.