రామేశ్వరం.. జ్యోతిర్లింగ క్షేత్ర స్థలపురాణం

తమిళనాడులోని రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అలరారుతోంది. ఇక ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించిన విషయానికి వస్తే.. శ్రీ రామచంద్రుడు రావణుడితో యుద్ధానికి సిద్ధపడి వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరుకుంటాడు. రాక్షసులను సంహరించే శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తాడు. ప్రత్యక్షమైన శివుడు ఆ వరాన్ని ప్రసాదించి, రామచంద్రుడి కోరిక పై అక్కడే జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు.

శ్రీరాముడు రావణ సంహారంచేసి తిరిగి అయోధ్యకి బయలుదేరి వస్తూ ఈ ప్రదేశంలో ఆగుతాడు. రావణ వధ వలన కలిగిన బ్రహ్మ హత్యా పాతకం తొలగిపోవడం కోసం ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. అందుకుతగిన శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడికి చెబుతాడు. ముహూర్త సమయానికి హనుమంతుడు రాకపోవడంతో, సీతాదేవి ఇసుకతో చేసిన శివలింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్ఠిస్తాడు.

శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు చిన్న బుచ్చుకోవడంతో, అతనిచేతనే ఆ లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రాముడు ప్రతిష్ఠించినది రామేశ్వర లింగంగా.. హనుమంతుడు ప్రతిష్ఠించిన శివలింగం హనుమదీశ్వర లింగంగా భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నాయి. ఇక్కడి రామేశ్వర లింగం ఇసుకతో చేసినదే అయినప్పటికీ … ఇంత కాలంగా అభిషేకాలు చేస్తూ వస్తున్నా చెక్కుచెదరక పోవడం గురించి విశేషంగా చెప్పుకుంటారు.

ఇక చుట్టూ సముద్రమే వున్నా తీర్థాలుగా పిలవబడుతోన్న ఇక్కడి బావులలోని నీరు తియ్యగా వుండటం దైవలీలగానే భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్రంలో మహా శివరాత్రి.. శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక ఇక్కడికి వచ్చిన భక్తులు.. సముద్రాన్ని హనుమంతుడు లంఘించిన గంధమాదన పర్వతం.. ధనుష్కోటి.. జటా తీర్థం దర్శించవచ్చు.

దర్శన మాత్రం చేతనే ధన్యతను ప్రసాదించే రామేశ్వరంలో, సీతారాములు ప్రతిష్ఠించిన శివలింగం చూడగానే.. వెంటనే సీతారాములని కూడా చూడాలనిపించడం.. మన కళ్ళ ముందరే హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నట్టుగా అనిపించడం సహజం.