కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రమ్యకృష్ణ..

సీనియర్ హీరోయిన్స్ లో ‘గ్లామరస్’ అనే పదం వినగానే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. అందం అభినయం కలబోసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సీనియర్ హీరోలు అందరి సరసన నటించి అలరించింది ఈ సొగసరి. జూనియర్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకుంది. ఇక దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌లో శివగామిగా నటించి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. మరొకరిని శివగామిగా ఉహించుకోలేంతగా అద్భుతంగా నటించింది.. కాదు.. కాదు ఆ పాత్రలో జీవించింది. ప్రస్తుతం ఈ ఎవర్‌గ్రీన్ గ్లామర్ డాల్.. తన భర్త, టాలీవుడ్ క్రీయేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. నాగార్జున సరసన ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటించనుంది.

తాజాగా ఈ నటి కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “మన కోసం, ఇతరుల కోసం.. వ్యాక్సిన్ తప్పనిసరి” ఆమె ట్యాగ్‌లైన్ పెట్టారు. ఆమె ఫోస్టుకు నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ‘మేడమ్ మీరు వ్యాక్సిన్ తీసుకుంటుండగా కూడా ఎంత అందంగా ఉన్నారో’ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ‘ఆ మాస్క్ పెడితే కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయ్.. ఆ చూపులు మా హృదయాలను గాయపరుస్తున్నాయ్’ అని మరొకరు కామెంట్ పెట్టారు.