విజయవాడ ఎయిర్ పోర్ట్ లో శరవేగంగా జరుగుతున్న మార్పులు

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పెరిగడంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగాన్నందుకున్నాయి.

ఇటీవలి కాలంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. కనెక్టివిటీ దేశంలోని దాదాపు అన్ని నగరాల్నించి ఏర్పడింది. ఈ నేపధ్యంలో పలు కీలకమైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కృషితో రన్ వే అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 470 కోట్లు మంజూరు చేసింది. ఏకంగా 3 లక్షల 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతోంది.

ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే…రాష్ట్రానికే తలమానికంగా నిలువనుంది. ఈ కొత్త భవనం నిర్మాణంతో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.