అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయాలి: జనసేన డిమాండ్

  • తెలంగాణలో పేద ప్రజలకు రేషన్ కార్డులు బంద్

శేరిలింగంపల్లి నియోజకవర్గం: అర్హులందరికీ త్వరగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. దీనిపై ప్రభుత్వం చేస్తున్న పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ప్రజలను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పలుమార్లు కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీంతో కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో జాప్యం చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ఆలోచన లేదని పౌరసరఫరాలశాఖ చెబుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి ఇంకా రేషన్ కార్డులను జారీ చేయలేదు. జూన్ నుంచి జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పేద ప్రజల పక్షాన జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతూ కలెక్టర్ అఫీస్ నందు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమండ్ చేస్తూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని, లేని ఎడల పేద ప్రజల తరపున జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, జి.ఎస్.కే శ్రావణ్, అరుణ్ కుమార్, ప్రవీణ్ సాహు, తదితర నాయకులు పాల్గొన్నారు.