ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ సీరియస్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ అయ్యింది. చట్టానికి వ్యతికంగా ఆన్‌లైన్ మనీ యాప్‌లు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఆర్బీఐలో రిజిస్టర్ చేసుకున్న సంస్థల దగ్గర నుంచే రుణాలు తీసుకోవాలని వెల్లడించింది. దేశంలోని పలు చోట్ల నుంచి ఈ యాప్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ప్రజలెవ్వరూ కూడా వాటి ఉచ్చులో పడొద్దని.. ఎవరితోనూ తమ వ్యక్తిగత సమాచారం, ముఖ్యమైన డాక్యూమెంట్స్‌ను షేర్ చేయొద్దని తెలిపింది. ఆర్‌బీఐ ప్రమాణాలకు లోబడి ఉన్న బ్యాంకులు, ఫైనాన్సియల్ ఈ మేరకు బుధవారం కీలక ప్రకటనను విడుదల చేసింది.

అతి తక్కువ సమయంలో.. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్స్ ఇస్తుండటం వల్ల వ్యక్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అవుతున్నారని ఆర్బీఐ తెలిపింది. లోన్ ఇవ్వడం ఒక ఎత్తయితే.. దాన్ని తిరిగి వసూలు చేసే విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని.. అమోదభాగ్యం కాని పద్దతుల్లో రుణ గ్రహీతల మొబైల్ ఫోన్ల నుంచి డేటాను యాక్సెస్ చేసి ఒప్పందాలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. కాగా, యాప్‌ల మోసాలపై sachet.rbi.org.in అనే వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ స్పష్టం చేశారు.