వాక్సిన్ వచ్చాకే రీ ఎంట్రీ: పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్ళి ఎంట్రీ ఇవ్వబోతోన్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. మొదటి రోజు లీకైన వకీల్ సాబ్ లో ఓ పిక్‌ను జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. ఏకంగా టీ షర్టులపై వేసి అమ్మితే క్షణాల్లో లక్షల స్టాక్ అయిపోయింది. అదీ పవన్ కళ్యాణ్ రేంజ్. అంతలా హైప్ పెంచిన వకీల్ సాబ్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే కరోనా వైరస్ వచ్చి వారి కలలఫై  నీళ్ళు చల్లింది.

జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ప్రాజెక్టుల వివరాల గురించి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

‘మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా’? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే పరిస్థితి ఏంటి? ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి కరోనా వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే’ అంటూ తేల్చిచెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.