పున: ప్రారంభమైన థియేటర్లు.. సినీ అభిమానుల్లో జోష్..

లాక్‌డౌన్ కారణంగా దాదాపు 8 ఎనిమిది నెలలుగా మూత పడిన థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకుంటున్నాయి. రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం థియేటర్ల నిర్వహణకు అనుమతించినా.. కరోనా భయం వల్ల చాలా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేయలేదు. కానీ నిన్నటి (శుక్రవారం) నుంచి హైదరాబాద్‌లోని మహేష్ బాబు ‘ఏఎమ్‌బీ మాల్’, ప్రసాద్ మల్టీప్లెక్స్, పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ వంటివి రీ ఓపెన్ అయ్యాయి.

పూర్తి స్థాయి భద్రత, కరోనా ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ మల్టీప్లెక్స్‌ను నిర్వహించబోతున్నట్టు యాజమాన్యం ప్రకటించారు. ఓటీటీలు ఉన్నా థియేటర్లో మూవీ చూసిన ఎక్స్‌పీరియెన్సే వేరు.. అంటూ సినీ ప్రియులు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.

ఇన్ని రోజుల తర్వాత తమకు దేవాలయం వంటి థియేటర్లు పున:ప్రారంభం కావడంతో పనిచేసే సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. క్రిస్మస్ నుంచి కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.