ఏలూరులో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలకు తక్షణ సహాయం ఎకరాకు 20వేల రూపాయలు చొప్పున అందజేయాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు నియోజకవర్గంలో నీట మునిగిన వరి పంట పొలాలను జనసైనికులు, వీర మహిళలతో కలిసి రెడ్డి అప్పలనాయుడు బుధవారం పరిశీలించి నష్టాల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై పోరాడుతామని హామీ ఇచ్చారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏలూరు నియోజకవర్గం పరిధిలో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగిందని, రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 35 వేల నుంచి 40 వేల రూపాయల వరకు పంటకు పెట్టుబడి పెట్టిన రైతులను తుఫాన్ నట్టేట ముంచిందన్నారు. అధికారులు కానీ, ఏలూరు ఎమ్మెల్యే గాని పంట పొలాలను పరిశీలించేందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉందని, అందుకు విరుద్ధంగా దున్నపోతుపై వర్షం పడినట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి షరతులు, ఆంక్షలు లేకుండా నీటమునిగిన, తడిసిన ధాన్యం మొత్తం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నాయకులు వీరంకి పండు, కందుకూరి ఈశ్వరరావు, కావూరి వాణిశ్రీ, ప్రమీల, ఉమా దుర్గ, ఎండి బీబీ, నూకల సాయిప్రసాద్, రెడ్డి గౌరీ శంకర్, ఎట్రించి ధర్మేంద్ర, పైడి లక్ష్మణరావు, సుధాకర్ రావు, అల్లు సాయి చరణ్, బుద్ధాపు గోవింద్, అన్నవరం, డానియల్, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.