ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల హడావిడి నడుస్తోంది. పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలు కానుంది.

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలుత్వరలో పూర్తి కానున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ ముగిసింది. మరో విడత ఎన్నికలు మిగిలాయి. మరోవైపు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మార్చ్ 2 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమై..మార్చ్ 14న జరిగే కౌంటింగ్‌తో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 75 నగర పంచాయితీలు, మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకుఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌..

–ఈనెల 25న నోటిఫికేషన్‌, మార్చి 15న ఎన్నిక

–నామినేషన్ల స్వీకరణకు మార్చి 4 తుదిగడువు

–మార్చి 5న నామినేషన్ల పరిశీలన

–మార్చి 8న నామినేషన్ల ఉపసంహరణ

–మార్చి 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌

–అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌

మార్చ్ 29వ తేదీతో నలుగురు ఎమ్మెల్సీల పదవీకారం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా, చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగుస్తున్నవాటిలో తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఏపీలో మార్చ్ నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి మార్చ్ వరకూ ఎన్నికల సందడి నెలకొననుంది.