‘అల్లు’ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ‘అల్లుడు’

ప్రముఖ సినీనటులు, నవ్వుల రారాజు అల్లు రామలింగయ్య 99వ జయంతిని అల్లు వారి ఫ్యామిలీతోపాటు అభిమానులు వేడుకగా జరుపుకుంటున్నారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన అల్లుడు, టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అల్లు రామలింగయ్య పెళ్లి కొడుకైన చిరంజీవి తలపై ఆప్యాయంగా చేయి పెట్టి ఆశీర్వచనాలు అందిస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు చిరు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన చిరంజీవి.. ”ఆయన పేరు గుర్తురాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మామవ్వ గారు కేవలం అందరినీ మెప్పించిన నటుడే కాదు.. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్ కూడా. స్వతంత్ర సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి.. గురువు.. అన్నింటికీ మించి మనసున్న మంచి మనిషి. ఈ 99వ పుట్టినరోజు నాడు ఆయనను స్మరిస్తూ.. వచ్చే సంవత్సరం ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.