సర్వే తర్వాతే స్కూల్స్ రీ ఓపెనింగ్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై పలు రాష్ట్రాలు తమ నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఏపీలోనూ జగన్ సర్కార్ సెప్టెంబర్ 5 నుంచి ఎట్టి పరిస్దితుల్లోనూ పాఠశాలలు ప్రారంబించేందుకు సిద్దమవుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఎవరికి వారు తేదీలు ప్రకటిస్తున్నారు. అయితే ఇదంతా సాధ్యమా అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. ఇవన్నీ గమనించే ఈ నెల 19వ తేదిన ఒక్క రోజు గడువుతో తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకుని చెప్పాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే ఒక్కరోజు సరిపోదని, మరింత గడువు కావాలని రాష్ట్రాలు కోరాయి.

ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు కేంద్రం ఆన్ లైన్లో సర్వే ఫార్మాట్ కూడా పంపింది. ఇందులో ప్రధానంగా మూడు ప్రశ్నలున్నాయి. విద్యాసంస్ధలు తెరవాలా వద్దా, తెరిస్తే ఎప్పుడు, అసలు స్కూళ్లు తెరవకూడదా, ఒకవేళ స్కూళ్లు తెరిస్తే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనే అంశాలపై సర్వే ఫార్మాట్ సిద్ధం చేశారు. త్వరలో విద్యార్ధుల తల్లితండ్రులకు వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్, సోషల్ మీడియా ద్వారా ఈ సర్వేను పంపి అభిప్రాయాలు తీసుకుంటారు. వీటి ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెబుతోంది.