పీవీకి భారతరత్న ఇవ్వాలoటూ అసెంబ్లీలో తీర్మానం

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రతిష్టాత్మక పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఇంత సువిశాల భారతదేశంలో ఎంతో జనాభా ఉంది. ప్రధానిగా సేవలు అందించే అవకాశం అతికొద్ది మందికే వస్తుంది. అలాంటి అరుదైన అవకాశం తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది.

పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు. ఆర్థిక సంస్కరణలతో దేశ గతినే మార్చివేసిన నేత. అందుకే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినట్లు కేసీఆర్ తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించిన ఘనత పీవీ సొంతం అని పేర్కొన్నారు.. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణాది వ్యక్తి పీవీ నరసింహారావు అని కొడియాడారు.

ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు పెట్టుబడులు వస్తున్నాయంటే అది పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ప్రతిఫలం. రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగానూ సేవలందించారు. ఆపై దేశం మొత్తానికి సేవ చేసే ప్రధాని పదవిని బాధ్యతగా నిర్వహించిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.