ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై సమీక్ష

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు. రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు ఇవ్వాలని కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ వేగవంతానికి ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేయాలని సీఎస్ నిర్ణయించారు. నియామక ప్రక్రియ వేగవంతానికి రిక్రూట్‌మెంట్ విధానాల్లో సంస్కరణలు తేవాలని సీఎస్ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఇందుకోసం అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని సూచించిన విషయం తెలిసిందే.