వరి వేయడమంటే.. రైతులు ఉరేసుకోవడమే: కెసిఆర్‌

ఒక్క కిలో ఉప్పుడు బియ్యాన్ని కూడా కొనలేం అని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పడంతో… యాసంగి నుంచి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమేననే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఆదివారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు మాట్లాడుతూ… తెలంగాణలోని యాసంగిలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా త్వరగా తీసుకుంటే వానాకాలంలో ఉత్పత్తయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ… ఇటీవల రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కెటిఆర్‌లు కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి విన్నవించామన్నారు. ఇప్పటికే కేంద్రం వద్ద అయిదేళ్లకు సరిపడా నిల్వలున్నాయని, కొత్తగా కిలో బియ్యాన్ని కూడా కొనలేమని తేల్చి చెప్పారన్నారు.

” దేశంలో కరవు, ప్రకఅతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజావసరాల దఅష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి.. రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత.. కేంద్ర మంత్రి గోయల్‌ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా కొత్తగా కొనేది లేదంటున్నారు.. ” అని అధికారులు వివరించారు.

సాధ్యం కాకపోవచ్చు..
”గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దీనిద్వారా సుమారు 1.40 కోట్ల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉంది. వీటి దృష్ట్యా పీడీఎస్‌ తదితర అవసరాల మేరకు, కేంద్రం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చు.

యాసంగిలో వరిని పండించకూడదు : వ్యవసాయశాఖ ఉన్నత స్థాయి సమీక్ష
ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యాన్ని తీసుకోబోమని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పడంతో.. ధాన్యాన్ని ప్రభుత్వం కానీ, మిల్లర్లు కానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని వ్యవసాయశాఖ ఉన్నత స్థాయి సమీక్ష తెలిపింది. రాష్ట్రంలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. రైతులు ఇకముందు వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.