రైడర్స్ స్టోరీ ‘ఇదే మా కథ’ ఫస్ట్ లుక్..!

శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యహోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇదే మా కథ’. గురుపవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో సుమంత్ అశ్విన్ – శ్రీకాంత్ – భూమిక – తన్యా హోప్ రైడర్స్ గెటప్ లో బైక్ మీద రైడింగ్ కి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. రోడ్ మార్గం నేపథ్యంలోనే సినిమా కథ సాగనుందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘రైడర్స్‌ నేపథ్య కథ అనగానే తొలుత నేను ఆసక్తి చూపలేదు. కానీ కథ విన్న తర్వాత నా అభిప్రాయం మారింది. మంచి సినిమాను మిస్‌ చేయకూడదనే ఆలోచనతో ఇందులో నటించా’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నలుగురు రైడర్స్‌ కథ ఇది. ఒంటరిగా ప్రయాణాల్ని మొదలుపెట్టిన వారు ఎలా ఏకమయ్యారు? ఈ ప్రయాణంలో వారు తెలుసుకున్న జీవితసత్యాలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. లడఖ్‌, హైదరాబాద్‌లలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. డిసెంబర్‌లో మనాలిలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’ అని అన్నారు. కమర్షియల్‌ పంథాకు భిన్నంగా వినూత్న రీతిలో తాను ఛాయాగ్రహణాన్ని అందించిన చిత్రమిదని సినిమాటోగ్రాఫర్‌ రాంప్రసాద్‌ అన్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. సప్తగిరి – సమీర్ – సత్యం రాజేష్ – శ్రీజిత ఘోష్ తదితరులు నటిస్తున్నారు.