జగన్ పుట్టిన రోజు కు రోజా కానుక

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు (సోమవారం) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తమ నాయకుడి పుట్టిన రోజును పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజున అరుదైన గిఫ్ట్ ను ఇచ్చి అందరినీ సంతోషపరిచారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పి.పుష్ప కుమారి అనే చిన్నారిని రోజా దత్తత తీసుకొని తన మంచి మనసును చాటుకున్నారు. మెడిసిన్ చదవాలని కోరిక ఉందన్న పుష్ప కుమారి కలను నిజం చేయడానికి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చును తానే భరిస్తానని రోజా హామీ ఇచ్చారు.

దత్తత తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రోజా.. ‘మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన మోహన్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది. హ్యాపీ బర్త్‌డే జగన్’ క్యాప్షన్ జోడించారు.