‘భీమ్లా నాయక్’తో పోటీపడనున్న ‘ఆర్ఆర్ఆర్’!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న విడుదల చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో ఉన్న రాజమౌళి.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పనులు మొదలెట్టారట. అయితే ఇప్పటికే భారీ సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా వచ్చి చేరడంతో ఈసారి టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీనే ‘భీమ్లా నాయక్’ విడుదల కానుండగా.. జనవరి 13న సర్కారు ‘వారి పాట విడుదల’ కానుంది. జనవరి 14న రాధేశ్యామ్ విడుదల కానున్న విషయం తెలిసిందే.