రుయా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: జగన్

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. మరణాల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

మరోవైపు ఏపీలో కరోనా కట్టడి చర్యలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌ అంశాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇళ్లస్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రారంభాలు, వైఎస్ఆర్ రూరల్‌-అర్బన్‌ క్లినిక్స్‌, వైఎస్సార్‌ జలకళ, రానున్న ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్ధతపై కూడా సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతులకు రుణ సౌకర్యాలపై అధికారులతో చర్చించనున్నారు. గ్రామసచివాలయాలు, ఆర్‌బీకేలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలపై సమీక్షించనున్నారు.