వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేలు ఆర్థికసాయం: జగన్

భారీ వర్షాలు వరదల నేపధ్యం లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితులపై సీఎం స్పందిస్తూ బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, ఇది మన ఇంట్లో సమస్యగానే భావించి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్టు ప్రకటించారు.

వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పది రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులకు నిర్దేశించారు. మరో మూడు రోజుల లోపు వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, వేగంగా స్పందించి విద్యుత్, సమాచార సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు. అధికారులే కాకుండా, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూడా సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని సీఎం సూచించారు. అంతకుముందు ఆయన వరద పరిస్థితిని జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించన్నుట్టు వెల్లడించారు.