తమన్నాకారణంగా రూ.5కోట్ల నష్టం: మాస్టర్ చెఫ్ షో నిర్వాహకులు

ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ ఛానల్ జెమిని టీవీలో ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా హోస్ట్ గా ఈ షో ప్రారంభమయింది. అయితే తమన్నాను హోస్ట్ గా తొలగించి… యాంకర్ అనసూయను నిర్వాహకులు తీసుకున్నారు. ఈ మార్పు చర్చనీయాంశమయింది. దీనికి సంబంధించి పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆమె అగ్రిమెంట్ పై సంతకం చేశారని చెప్పారు. అయితే ఆమె ఇతర కమిట్ మెంట్ల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చారని… రెండు రోజులు రాలేదని తెలిపారు.

ఈ రెండు రోజులు ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్ల… 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న తమకు రూ. 5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని వెల్లడించారు. ఆమెకు అప్పటికే రూ. 1.56 కోట్ల పేమెంట్ చేశామని… చివరి రెండు రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ కూడా చేసేవాళ్లమని తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా… సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారని… అసలు సెకండ్ సీజన్ కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని స్పష్టం చేసింది. తమన్నా అంశానికి సంబంధించి ఏ వార్త రాయాలన్నా తమను సంప్రదించి రాయాలని కోరారు.