31 నిమిషాల ఆలస్యానికి రూ.500 పార్కింగ్ ఛార్జి..

దిమ్మ తిరిగిపోయే పార్కింగ్ ఛార్జీలతో షాకుల మీద షాకులు ఇస్తోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రైవేటుకు పగ్గాలు అందిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. పార్కింగ్ ఛార్జీల పేరుతో దక్షిణ మధ్య రైల్వే ప్రజల మీద మోపుతున్న భారం ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టే రసీదు ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హడావుడి చేయటమే కాదు.. మంత్రి కేటీఆర్ కు సైతం ట్యాగ్ చేశారు.

కరోనా తర్వాత పూర్తిస్థాయి రైళ్లను పట్టాల మీదకు పరుగులు తీయలేదు కానీ.. రద్దీ నియంత్రణ పేరుతో ఛార్జీల వడ్డింపు ఎంత భారీగా ఉంటుందనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రెండు వైపులా పార్కింగ్ ప్లేస్ లు ఉన్న సంగతి తెలిసిందే. ద్విచక్రవాహనాలతో పాటు.. కార్లను కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. తాజా నిబంధనల ప్రాకరం టూ వీలర్ ను రెండు గంటల పాటు నిలిపితే రూ.15.. కారు అయితే రూ.50 చొప్పున పార్కింగ్ ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ఇంతవరకు ఓకే అనుకున్నా.. ఇక్కడో దారుణమైన తిరకాసు ఒకటి తీసుకొచ్చారు.

దీని ప్రకారం.. రెండు గంటలకు మించి పార్కింగ్ ప్లేస్ లో కారును ఉంచితే.. దానికయ్యే పార్కింగ్ ఫీజు కింద వసూలు చేసే మొత్తం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కారును పార్కింగ్ చేసిన రెండు గంటల తర్వాత ఫీజు వసూలు చేయటం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎలాంటి అదనపు సొమ్మును వసూలు చేయరు.

కానీ.. రెండు గంటల తర్వాత 8 నిమిషాల నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ కింద రూ.100 16 నిమిషం నుంచి 30నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జి కింద రూ.200 30 నిమిషాలు దాటిన తర్వాత మాత్రం ఆలస్యమైతే ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ కింద రూ.500 వసూలు చేస్తున్నారు. స్టేషన్ లో వాహనాన్ని పార్కింగ్ చేసిన తర్వాత ట్రైన్ ఆలస్యంగా రావటం.. మరేదైనా కారణంగా వాహనాన్ని తీసుకెళ్లకపోతే.. మరీ ఇంత దారుణంగా బాదేయటం ఏ మాత్రం సరికాదంటున్నారు. తాజాగా ఒక ప్రయాణికుడికి ఎదురైన ఈ చేదు అనుభవం సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చగా మారింది. మరి.. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.