25,000ల మంది సినీ కార్మికులకు సల్మాన్ ఆర్థిక సాయం

కోవిడ్-19 సెకండ్ వేవ్ తో దేశంలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎంతోమంది కరోనాతో కన్నుమూస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్‌మెన్, స్పాట్‌బాయ్‌లు తదితరులు… ఇలా 25,000ల మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,500ల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బిఎన్ తివారీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “మేము సల్మాన్ ఖాన్‌కు అవసరమైన వ్యక్తుల పేర్ల జాబితాను పంపించాము. ఆయన సాయం చేయడానికి అంగీకరించాడు. 35,000 మంది సీనియర్ సిటిజన్ కార్మికుల జాబితాను యష్ రాజ్ ఫిల్మ్స్‌కు పంపించాము. సహాయం చేయడానికి వారు కూడా అంగీకరించారని బిఎన్ తివారీ తెలిపారు. ఈ ప్రొడక్షన్ హౌస్ రూ.5000లతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ రేషన్ సరకులు ఇవ్వనుంది అని తివారి పేర్కొన్నారు. ఇక ఇటీవలే సల్మాన్ ఖాన్ 5,000ల మంది ఫ్రంట్లైన్ యోధులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశాడు. ఈ నటుడు యువసేన నాయకుడు రాహుల్ కనాల్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పోలీసు సిబ్బంది మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఉన్నారు. కాగా మే 13న ఈద్ సందర్భంగా తెరపైకి రానున్న ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు సల్మాన్.