వేల ఏళ్లుగా సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది

* సనాతన ధర్మం భారతీయులందరి ఏకత్వం
* దేశంలో సగం జనాభా పుణ్య స్నానాలు ఆచరించడం గొప్ప విషయం
* యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా కుంభమేళా ఏర్పాట్లు పక్కాగా చేసింది
* ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో సతీసమేతంగా పుణ్య స్నానాలు ఆచరించిన పవన్ కళ్యాణ్

‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వాక్యాలు చదివాను. సుమారు మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’ అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళాకు పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు హాజరై పుణ్య స్నానం ఆచరించారు, అనంతరం త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. అకీరా నందన్, త్రివిక్రమ్, ఆనంద సాయి పుణ్య స్నానాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ “భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పని చేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయుల్లో అదే రకమైన ఏకత్వం పని చేస్తుంది. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్థిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా పెద్ద విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావిస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లడం మహా అద్భుతం. 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహా కుంభ మేళాలో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన, సనాతన ధర్మాన్ని నమ్మే వారి పైన ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహా కుంభ మేళా నిర్వహణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది. ఒక భారీ సమూహం ఒక చోట గుమి కూడినప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి, ఆ ధర్మాన్ని నమ్మేవారిపై, సనాతన ధర్మంలో ఆచరించే సంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యానించడం సబబు కాదు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందించేవారా? ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం సులభం. కేవలం హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం కార్యక్రమాల నిర్వహణలో ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే నాయకులు మాట్లాడటం మొదలుపెడతారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పని చేసి, పక్కాగా తగిన సౌకర్యాలు కల్పించినా, ఒక్కోసారి అనుకోని విధంగా ఘటనలు జరగడం బాధాకరం. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసినా ఒకేసారి సమూహంలో వచ్చిన కదలిక వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని స్పందిస్తే బాగుంటుంది. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదు” అన్నారు.

e7b2022b-8061-4213-ae77-dd5409a8b292-1024x681 వేల ఏళ్లుగా సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది

Share this content:

Post Comment