సంగం డెయిరీ కేసు.. ధూళిపాళ్ల బెయిలు రద్దు కుదరదన్న హైకోర్టు

సంగం డెయిరీ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత, సంగం డెయిరీ మాజీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్‌కు మే 24న మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలంటూ గుంటూరు ఎస్పీ రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

దీనిని విచారించిన న్యాయస్థానం బెయిలు రద్దుకు కారణాలు కనిపించడం లేదంటూ ఆ వ్యాజ్యాలను నిన్న కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఏసీబీ తరపున గాయత్రిరెడ్డి వాదనలు వినిపించారు. నరేంద్రకు బెయిలు మంజూరు చేస్తూ విధించిన షరతులను గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకావడం లేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని ఆరోపించారు.

ధూళిపాళ్ల తరపు న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పాల ఉత్పత్తిదారుల నుంచి సేకరిస్తున్న పాల ధరల పెంపు విషయంలో చైర్మన్ హోదాలో బోర్డు డైరెక్టర్లతో ధూళిపాళ్ల సమావేశం నిర్వహించారన్నారు. వాదప్రతివాదాలు విన్న న్యాయస్థానం.. ధూళిపాళ్ల బెయిలు రద్దుకు గల కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

చైర్మన్ హోదాలో బోర్డు డైరెక్టర్లతో సమావేశం నిర్వహిస్తే తప్పేముందని ప్రశ్నిస్తూ ఏసీబీ దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను కొట్టివేసింది. ఏసీబీ అధికారులు ఇప్పటికే పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారని, కాబట్టి మళ్లీ నోటీసులు జారీ చేయడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది.