8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు

కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయం కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి.

వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే ఉండిపోయింది. జలాశయ నీటిమట్టం మరో అడుగు తగ్గితే శివలింగం పూర్తిగా దర్శనమిస్తుంది. ఆలయం బయటకు రావడంతో పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. రేపటి నుంచి ఆలయంలో పూర్తిస్థాయిలో పూజలు జరిగే అవకాశం ఉందని పూజారులు తెలిపారు.