యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం

యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా దివంగత కల్నల్‌ సంతోష్‌ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో సంతోషి కలెక్టరేట్‌కి చేరుకోని.. ఈ రోజు ఆమె బాధ్యతలు తీసుకోన్నారు. కాగా జూన్‌ నెలలో భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.. దీంతో.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్.. ఆయన భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, స్థలం, రూ.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. గతంలోనే ఆమె నియామకానికి సంబంధించిన పత్రాలతో పాటు, స్థల పత్రాలు, రూ. 5 కోట్ల చెక్కును సంతోషికి అందజేసిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కేబీఆర్ పార్కు సమీపంలో కేటాయించిన 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంతోష్ బాబు పిల్లల పేరిట రూ. 4 కోట్లు చెక్, ఆయన తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. జులై నెలలో ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా యాదాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా కేటాయించడంతో ఇవాళ ఆమె విధుల్లో చేరనున్నారు.