రైతన్న కన్ను నెత్తురోడుతోంది కాపాడండి: ఆళ్ళ హరి

  • అకాల వర్షాలతో ఊహించని నష్టాల్లో అన్నదాత
  • ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం
  • అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేది ఉందా?
  • కలెక్టర్ గారూ మీరన్నా రైతన్నను కాపాడండి అంటూ రెండు చేతులూ జోడించి వేడుకున్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

ఆళ్ళ హరి, ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో కళ్ళముందే పాడైపోతుంటే రైతన్న కంట కన్నీటికి బదులు రక్తం కారుతుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో అపార నష్టాల్లో మునిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న జిల్లా రైతాంగాన్ని మీరన్నా కాపాడండి అంటూ ఆయన శుక్రవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని రెండు చేతులూ జోడించి వేడుకున్నారు. ఊహించని విపత్తుతో రైతన్న కుదేలవుతున్నాడని ఇటువంటి పరిస్థితిలో మేమున్నాం అంటూ భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం అత్యంత హేయమన్నారు. అసలు రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయని , రైతన్న నరకకూపంలో ఉన్నాడని నాలుగేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన ముఖ్యమంత్రికి తెలుసా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి బాబాయ్ హత్యకేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో ఉన్న శ్రద్ధ కష్టనష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవడంలో లేకపోవటం శోచనీయమన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతుల్ని ఇంతవరకు ఎవరూ కూడా ప్రభుత్వం నుంచి పలకరించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో వ్యవసాయశాఖ ఒకటుందని, దానికి ఒక మంత్రి కూడా ఉన్నాడా అన్న అనుమానం కలుగుతుందన్నారు. తమ పార్టీ పేరులో మాత్రం రైతుని పెట్టుకున్నారు కానీ రైతుని , రైతాంగాన్ని ఎప్పుడో ఈ ప్రభుత్వం మరచిపోయిందని, బటన్ నొక్కే దగ్గరే ఈ ప్రభుత్వ పాలన ఆగిపోయిందని విమర్శించారు. జిల్లాలో ఉన్న మంత్రులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇంతవరకు నష్టపోయిన పంటని పరిశీలించకపోవటం రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ, బాధ్యత ఉందో అర్ధమవుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన పంటను యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే అన్నదాతను ఆదుకోవాలని కలెక్టర్ ని ఆళ్ళ హరి కోరారు. రైతు కంట కన్నీరు సమాజానికి హేతువు కాదని అన్నదాతను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కించకుండా వెంటనే రైతులను ఆదుకోవాలని ఆళ్ళ హరి ప్రభుత్వాన్ని కోరారు.