Sai Tej ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌.. , బర్త్ డే రోజునే.. ఇది పునర్జన్మ.. చిరు ట్వీట్..

గత నెల వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. 35 రోజులుగా సాయి తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తేజు ప్రమాదానికి గురైన సమయంలో అతడి పరిస్థితిపై అనుమానాలు, ఆందోళనలు ఉండేవి. కానీ తేజు వైద్యుల చికిత్సకు స్పందిస్తూ నెమ్మదిగా కోలుకుంటూ వచ్చాడు. 

తాజాగా సాయి తేజ్ ఆరోగ్యం కుదుట పడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం తేజు ఆసుపత్రి నుంచి స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వైష్ణవ్ తేజ్ కూడా తేజు అన్నయ్య త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని ప్రస్తుతం ఫిజియో థెరపీ జరుగుతోందని ప్రకటించాడు. 

అందుకు తగ్గట్లుగానే నేడు సాయి తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇది అభిమానులకు, మెగా కుటుంబ సభ్యులకు శుభవార్త. బైక్ నుంచి పడిన తేజు కి శరీరంలో గాయాలయ్యాయి. కాకపోతే హెల్మెట్ ధరించడం, ప్రమాదకర గాయాలు కాకపోవడంతో తేజు క్షేమంగా బయటపడ్డాడు. 

మరో విశేషం ఏంటంటే నేడు సాయి తేజ్ బర్త్ డే. పుట్టిన రోజే తేజు డిశ్చార్జ్ కావడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తేజు డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంట్లో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం అవుతుంది. తేజు పూర్తిగా కోలుకుని షూటింగ్స్ కి హాజరు కావడానికి మరికొన్ని రోజుల టైం పట్టవచ్చు. 

Nagababu కూడా ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిశ్చార్జ్ అయ్యాక కుడా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని తేజుకి చెబుతున్నాం. కానీ తేజు మాత్రం షూటింగ్స్ కి హాజరవుతానని అంటున్నాడు అంటూ నాగబాబు కామెంట్స్ చేశారు. 

ఇటీవల తేజు నటించిన Republic మూవీ అక్టోబర్ 1న విడుదలయింది. తేజు తదుపరి ఓ థ్రిల్లర్ మూవీలో నటించబోతున్నాడు. నేడు తేజు బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ Allu Arjun ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. తేజు త్వరగా కోలుకుంటుండడం సంతోషంగా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. 

ఇక Megastar కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ఈ విజయదశమికి మరో విశేషం కూడా ఉంది. తేజు డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తున్నాడు. ప్రమాదం తర్వాత తేజు పూర్తిగా కోలుకున్నాడు. అంత ప్రమాదం నుంచి తేజు బయటపడడం మా అందరికి సంతోషాన్ని ఇచ్చే అంశం. ఇది తేజుకి పునర్జన్మ లాంటిదే. నా నుంచి మీ అత్త నుంచి నీకు హ్యాపీ బర్త్ డే డియర్ తేజు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.